1, మార్చి 2021, సోమవారం

 

శిశిరం ఫిర్యాదు 

                Stephane mallarme

                              French Poet
                              (1842-1896)
 

మరియా నన్నొదిలి మరో నక్షత్రానికి వెళ్ళేవరకూ - నక్షత్రం,కాలభైరవ,శ్రవణం - లేదంటే నువ్వా పచ్చ వీనస్? - నేను ఎప్పుడూ  ప్రేమిస్తాను ఏకాంతాన్ని. ఎన్ని సుదీర్ఘమైన రోజులు గడిపాను ఒంటరిగా నా పిల్లితో. ఒంటరిగా అంటే దానర్ధం ఆవశ్యకమైంది ఏదీలేకుండా,నా పిల్లి ఒక మార్మికమైన చెలికత్తె. ఒక ఆత్మ. నేను చెప్పాల్సింది ఏమిటంటే సుదీర్ఘమైన ఒంటరి రోజులు గడిపాను నా పిల్లితో ఇంకా ఒంటరిగా ఒకానొక నైతికపతనం చెందిన చిట్టచివరి రోమన్ గ్రంథకర్తతో. అప్పటినుండీ లేదు ప్రేమించేందుకు మరో తెల్లపురుగు,చోద్యం అసమానత, ప్రతిదీ కూర్చబడుతుంది పదంలో: పతనం.అలా,సంవత్సరంలో, నా ప్రియమైన కాలం గ్రీష్మం చివరి మందగమనం అది రమారమి శిశిరస్థానం.ఇంకా,పగలు నేను నడిచే సమయంలో ఎప్పుడైతే సూర్యుడు సందేహిస్తాడో అంతర్ధానమయేముందు,పసుప్పచ్ఛ కంచు కిరణాలు బూడిదరంగు గోడలమీద,ఇంకా ఎర్రని రాగి కిరణాలు పెంకులమీద.సాహిత్యం కూడా, విషయాసక్తత నుండీ నా ఆత్మ అడుగుతుందో అదే వేదన కలిగించే రోమన్ కవిత్వపు చివరి క్షణాలు.చాలాకాలంగా శ్వాసించనట్లుగా అమర్యాదస్తుల దృఢ ధృక్పథం లేదా పిల్లతనపు నంగితో లాటిన్ లో మాట్లాడినట్లుగా క్రైస్తవ వచనం.అప్పుడు నేను చదువుతాను ప్రియమైన కవితల్లో ఒకటి.( ఎర్రచూర్ణపు పొలుసులైతే నాకు మరింత ఆకర్షణీయమౌతాయో యవ్వనపుష్టిని మించి),జంతువుల నాణ్యమైన బొచ్చులో చేయిపెట్టినట్లు,అప్పుడో వీధి వాయిద్యం ధ్వనిస్తుంది సోలిపోతూ దుఃఖంతో నా కిటికీ కింద.అది ధ్వనిస్తూనే వుంటుంది బూరుగుచెట్టు ఆకులవంటి గొప్పఇరుకుప్రదేశాల్లో,వసంత కాలంలో కూడా,దుఃఖకరంగా కనబడుతున్నాయి నాకు మరియా వాటితో వెళ్లిన నాటినుండీ,ఆమె చివరి ప్రయాణం, ,కొవ్వొత్తుల నడుమ అబద్ధం.విచారకరమైన వాయిద్యం,అవును,తప్పకుండా:పియానో తళతళలాడుతోంది, వయోలిన్ యిస్తోంది కాంతిని చిరిగిన పొరలోంచి,కానీ వీధి వాయిద్యపు జ్ఞాపకాల అరకొర కాంతి కలలుకంటోంది నిరాశగా. ఇప్పుడిది గొణుగుతోంది ఆహ్లాదకరంగా సాధారణమైన పాటని ఉల్లాసంతో శివారు ప్రాంతాలని నింపుతూ,పాతదైన, విశేషమూలేని బాణీ:ఎందుకీ పదాలు నా ఆత్మని చీల్చి ఏడిపిస్తాయి నన్ను,శృంగార జానపద గీతాలేవైనా?నేను నెమ్మదిగా రుచి చూస్తాను ఐతే విసరను నాణాన్ని కిటికీగుండా ఎందుకంటే నా ఆత్మని సంకటపరిచే భయాన్నుండి అనాచ్చాదితం చేసేదిమాత్రమే కాదు వాయిద్యం ఆలపిస్తోంది.    

12, ఆగస్టు 2019, సోమవారం

ఆగ్ర హంలో దేముడు

     ( God in wrath )


                              __  స్టీఫెన్ క్రేన్.  
    
ఆగ్ర హంలో  దేముడు
దండిస్తూ ఒక మనిషిని ;
వాడిని చరుస్తూ అతడు అరుస్తూ బిగ్గరగా
మేఘ ఘర్జనలతో విసురుతూంటే
భూమిమీదుగా గింగిర్లెత్తుతూ ఆధ్వనులు.
చేరారు ప్రజలంతా పరుగుతో వచ్చి.
ఆ మనిషి కేకలేస్తూ ప్రయాసపడుతూ,
కాస్తంత పిచ్చిగా దేముడి పాదాలవద్ద ,
ప్రజలు అరిచారు
" అహో  ఎంత దుర్మార్గమైన మనిషి ! "
" ఆహా ఎంత శతృభయంకరుడైన దేముడు ! "  



   



































































































































20, జనవరి 2018, శనివారం

తెలుగు కవిత్వానికి తాజాశ్వాస ”గాలి అద్దం”



This is the sound of poisons
The sickness no one knows
                              --- Shriek back (Faded flowers)
                             
మన మొఖం మీద  ముప్పిరిగొనే ఆశ్చర్యార్ధకాల్ని పొడుస్తూ వచ్చింది నాయుడి రెండో కవితాసంపుటి "గాలి అద్దం"
                 భాషకీ,అక్షరాలకీ,వాటిశబ్దాలకీ వుండే అల్పపరిమితిని బాగా అర్ధం చేసుకున్నాడు కనుకనే  " ఏ స్వరమూ లేని పదాలతో/అక్షరాలు శబ్దిస్తే సరిపోతుందా/ప్రతి అక్షరంలోపల శూన్యజ్వాల". అనగలిగాడు (దాటాలి)
                           అకవిత్వంకన్నా కవితాంశవున్న అస్పష్టకవిత్వం ఎప్పుడైనా మేలే.మన సంప్రదాయ అవగాహనకి అందక మనల్ని ఖిన్నుల్ని చేయడం,కవి లేదా కవిత్వం తప్పుకాదు.అది మనపరిమితిలో వుండే లోపం.వ్యక్తికి బహువచనం వ్యవస్థ.వ్యక్తిలోని సంఘర్షణ వ్యవస్థాపరమైందే తప్ప వైయక్తికం కాదు.అట్లాగని నాయుడిని జాలితో మినహాయించనవసరం లేదు మనం."జీవించే జైలులో నమ్మదగ్గ మౌనం దొరికేనా " అన్న కవిని మనం అత్యంత శ్రద్ధాసక్తులతో గమనించి వెంటనడవాలి," కీలుబొమ్మల దుఃఖాన్ని సాదరంగా సహానుభూతితో అర్ధం చేసుకోవడానికి.          
                           నాయుడు శిల్పానికి ఇచ్చిన ప్రాధాన్యత వస్తువుకి ఇవ్వనట్లే వుంటాడు,కానీ ఓ ఉద్విగ్నభరితమైన అనుభూతినిస్తాడు. అది మనలో ఒక మానసిక పులకరింతని కలిగిస్తుంది.లేదా మనలోని అస్పృస్యవూహల్ని తట్టిలేపుతుంది.మొట్టమొదటి కవిత  "అద్దం ~ కిటికీ" తోనే మనలోని మానసిక ఉద్వేగాల మంచుపొరలమీద క్రియానిష్ఫలతని పచ్చబొట్టుగా పొడుస్తాడు.
                             కవికీ సమాజానికీ మధ్యవుండే అంతరం లేదా అంతఃసంఘర్షణే నాయుడి కవితాకర్షణ ."నహీ...నహీ" అనే కవిత అర్ధమయ్యే మంచి ఉదాహరణ.ఇతనో Rhetoric. ఇదంతా ఓ ఫిలసాఫికల్ ఎగోని.ఇది మనం నిత్యం అనుసరించే మార్గం కాదు.మన సాంప్రదాయ దుర్భిణులకు అందదు.ఏ హబుల్ దుర్భిణికీ లొంగదు.మరింత సూక్ష్మావగాహన కావాలి.వాడిపోయిన పూలపరిమళాలని అతడు దోసిలిపట్టి అందిచ్చినప్పుడు ఆఘ్రాణించి తట్టుకోగలిగే శక్తి మనలో వుండాలి.
                                  ఇంతకీ "గాలి అద్దం" దేనికి ప్రతీక ? అద్దం మన ప్రతిబింబాన్ని మనకు చూపుతుంది. అద్దంలో మనల్ని మనం చూసుకున్నంతసేపే అద్దానికి సంభంధించిన మన ఉనికి. పక్కకి వెళ్ళాక మనగురించిన జ్ఞానం అద్దానికి వుండదు. అదే అద్దం గాలిదైతే,గాలి అద్దమైతే, అది మనకి చూపించే దృశ్యం అంత విశ్వాసపాత్రమైంది కాకపోవచ్చు.అటువంటి గాలి అద్దం మనలో ఏ ప్రేమని,ఏ విశ్వాసాన్ని ప్రోదిచేస్తుంది? అసలు మన ప్రతిబింబాన్నే మనకి చూపుతోందన్న నమ్మకమేమిటి? ఐనా మన రక్తంలో జీర్ణమైన విశ్వాసాల కారణంగా మనం గాలి అద్దం తళుకుబెళుకులకు సమ్మోహితులమై కకావికలమైపోతాం."ఎవరికో చెందినవాళ్ళుగా,ఎవరికీ చెందనివాళ్ళుగాపరాయీకరణనీ, వొంటరివైమనస్యాన్నీ పొందుతాం.                                  
                 అతనే అన్నట్లు అతని కవిత్వం "కాస్త నిరాకరించే అక్షరాలు ... ... అలవాటుకాని ఆకారాలతో పదాలు"(అలల సమాధుల్లో).అతి అరుదైన Artistic soul నాయుడి కవిత్వం.మూసిన కనురెప్పలకింద బాధాగ్నిని దాచుకున్న కవి ఇతడు,అందుకే అంటాడు "కన్నీళ్ళని ఆపిన కనురెప్పల్ని మూసినట్టు తలుపెయ్యకు"(కాలం వెలగని దీపం).
                         నాయుడి  విశిష్టతేమంటే భయకంపిత మనస్కుల్ని ఓదార్చడానికి భుజంతట్టడు.వీపుమీద అరిచేత్తో చరుస్తాడు."ఇక్కడ వోటముల్లేవ్ కన్నీళ్లేవ్ అసలిక్కడ ఎవరు బతికారు" అంటాడు.అంటే అసలు మనం బ్రతికిన,బ్రతుకుతున్న బతుకు బతుకే కాదని ఒక గొప్ప వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తూ ఆగర్భశోకితుడిలోకం కనిపిస్తోందని,చీకటి పడేలోగా చేరుకోవాలని,ఇక సర్దుకోవాల్సిన సరంజామాని వెతకాలని దైన్యంతో కాదు ధైర్యంగా తన ప్రస్థానాన్ని మొదలెడతాడు.  
                        అజ్ఞానమిచ్చే సుఖం గొప్ప ఆనందాన్నిస్తుందా,లేక జ్ఞానం ముదిరి మనిషి తనలో తాను దహించుకుపోతూ,తనతో తాను ఘర్షించుకుంటూ అశాంతితో తనను తాను ప్రశ్నించుకునే బాధాసంధర్భాలెక్కువ ఆనందాన్నిస్తాయా అంటే రెండవదేనంటాడు నాయుడు."బాధాంగాలన్నీ దొరకట్లేదు కోసితీద్దామంటే ఏది బాధించని అంగాంగమో తెలియట్లేదు "(రంగుల సాలీడు).

                 అతనే పీడకుడు,అతనే పీడితుడు.అనేకానేక మూర్తభంగిమల్లో పేర్చుకున్న మానవ శిధిలావశేషాల శయనాల మధ్య నిర్భీతిగా,ఆర్తిగా తిరుగాడే వీరబాహుడతను.వాడిపోయిన రోజుల్ని భుజానేసుకొని తిరిగే భేతాళుడు.
                 "ఇక భవిష్యత్తు అంతరించింది/నా సొంతమంటూ ఏమీలేదు/మృత్యువు తప్ప" అన్నప్పుడు అది కేవలం వైయక్తిక భయానక అనుభవం మాత్రమేకాక,నిబిడాంధకార నిశ్శబ్ధంలోకిజారి స్వప్నసమాధుల్ని ఆలింగనం చేసుకున్న అనేకానేక దగాపడ్డ మానవ సమూహాల నిశ్చేష్ట.
                  ఈ కవితా సంపుటిలోని ఒకేఒక్క Shallow Poem "మా రాక్షసుడా".దాన్ని పరిహరించివుంటే బాగుండేది.
                  మనం రాసే కవిత్వం వందేళ్ళు బతకాలి.అసలుముందు నిలబడాలి.ఇప్పటి మన కవిత్వం తర్వాతెప్పుడో సంపూర్ణంగా గ్రాహ్యమవాలి.కవిత్వం మనకి విప్పి చెప్పాల్సింది భావం కాదు,అనుభూతి మాత్రమే.విలియం కార్లోస్ విలియంస్ మాటల్లో చెప్పాలంటే "Poetry is not a matter of representation, field of action". సమాజం మిధ్య,సంఘజీవనం దుర్భరం దౌర్భాగ్యం అయిన సంధర్భంలో మనం ఆశ్రయించాల్సింది సంక్లిష్టతతో చిక్కుపడ్డ కవిత్వాన్నే.కవిత్వం ఇవ్వాల్సింది ఇంటాక్సికేషన్ కాదు Ecstasy.అది నాయుడి కవిత్వంలో పుష్కలంగా దొరుకుతుంది.
                   ఒక భాషని సజీవంగా నిలబెట్టే క్రమంలో కవిత్వం కొత్తపుంతలు తొక్కాలి.ఎప్పటికప్పుడు సరికొత్త ఉదయంలాంటి తాజాదనాన్ని అందించాలి.పట్టుమని ఓ పదిహేను స్వంతగొంతుకలైనాలేని తెలుగు కవితావరణంలో నాయుడిదో విశిష్టమైన ,విలక్షణమైన స్వరం.ఆ విధంగా సఫలుడైన శ్రేష్టమయిన కవి ఎం.ఎస్.నాయుడు.     
                                                                                                                                                                                                                                                              

                                                                                                                          -     పి.కృష్ణ ప్రసాద్.