కన్నీళ్ళన్నీ ఖర్చయాయి ,
శవంలా బిగుసుకొంది జీవితం .
పొడిబారిన కళ్ళతో చూడలేకున్నాను దృశ్యం .
కొట్టుమిట్టాడుతోంది గొంతులో ఏదో రహస్యం .
మిగిలుంటే అదే పదివేలు , కనీసం నన్ను నేను గుర్తించే జ్ఞానం :
నాయనలారా భేదాభిప్రాయాల మత్తులోపడి
దాటివెళ్ళకండి . నన్నూ చేర్చండి ఒడ్డు , శాపనార్ధాల మధ్యైనా సరే !
సమయానికి నిద్రమాత్రలిచ్చిందిలే మా అమ్మాయి ,
భయపడకండి , తిరగమని చెప్పండి భూమిని కాస్త నాజూకుగా ,
చస్తున్నంత పనవుతోంది కళ్ళు తిరిగి , సెకండ్ల ముల్లు మరీ పచ్చి తిరుగుబోతు .
పెద్దముల్లు ఫరవాలేదు కాసింత పడుతుంది బిడియం. చిన్నముల్లా
సరేసరి , అదో పెద్దసోమరి , ఆలోచించిమరీ వేస్తుందిఅడుగు .
అబ్బాయిలూ ! కాలాన్ని చంపే సాధనమేదైనా వుందా?
కనిపెట్టండి . తొందరేంలేదు . అలా కళ్ళుజాపి కూర్చుంటాను ,
బేతుపల్లి చెరువుగట్టున . గత వర్షాకాలమిదో పూర్ణగర్భిణి .
తొణికి ఒలికి భయాన్నుసిగొల్పింది తాళ్ళమడ జనం మీదికి .
స్త్రీలూ పిల్లలూ వృద్ధులూ బేతుపల్లి వెళ్ళారు తలదాచుకునేందుకు .
కొందరు గంగారం సాయిస్ఫూర్తి కాలేజింజనీరింగుకి , మిగిలిన జనం సత్తుపల్లి .
నాయనలారా ఏమైంది ? నే చెప్పినపని !
కవిమిత్రుడు వస్తూంటాడు అప్పుడప్పుడూ , నన్ను హింసించేందుకు ,
కవిత్వం ఒండేప్పు డు కాస్తంత ఆర్ద్రతో ఆత్మనో కలపమంటాడు
ఈ చెరువొడ్డున కూర్చోబెట్టి . ఆ రెండూ ఎక్కడేడ్చాయిగనుక మనకి .
" పచ్చదనం ప్రగతికి మెట్టు "
రాసిన బోర్డు దగ్గరే మొదలైంది
ఓపెన్ కాస్ట్ .
సత్తుపల్లి శివార్లలో
పచ్చని చిట్టడవి .
ఇప్పుడు రూపురేఖలు కోల్పోయి
మిగిలిన మరుభూమి .
అయ్యలారా !
ఈ బొగ్గెటకేగునోకదా ! ఏవో జనం భయాలు .మా నీళ్ళు కలుషితం కావుగా ?
భూగర్భ నీటిమట్టం నిలిచేవుంటుంది గదా !
పాపం ఎవరు చెబుతారు సమాధానం ? ఎవరెవర్ని వూరడిస్తారు !
*** *** ***
అయ్యా రాండి...................... రాండి
ఇదిగో ఓజోన్ పొర చింపుకొచ్చాను .
అర్ధరూపాయికో ముక్క , కప్పుకోండి
తలలమీద . ఇంకేబెంగావుండదు .
( దేముడి దయవల్ల వ్యాపారం బానేవుంది )
*** *** ***
ఎందుకో భయమవుతోందిప్పుడు . అర్ధరూపాయికి కాదు ,
అయిదువేలకి అమ్మాల్సిందేమో ! కాదుకాదు ఏభైవేలకి .
ఎంత కారుచవక్కమ్మాను పిచ్చాడిలా .....
కూర్చుని ఎంచక్కా తినేవాళ్ళు 100 తరాలు నావాళ్ళు .
ఇప్పుడు భయమవుతోందెందుకో, పిల్లల్ని కన్నందుకు .
ఓ పక్క కొండచిలువలా ఆవులిస్తూ కాలుష్యం .
మరోపక్క జాన్ పెర్కిన్స్ పశ్చాత్తాపం .
పాపం చుట్టూరా వీళ్ళు ; నాదేశ యువజనం , తృళ్ళుతూ .......
ఎంతకాలమీ చిర్నవ్వులు ? ప్రపంచపటంలో రేపు నా దేశమెక్కడ ?
*** *** ***
ఒరే బాబులూ నన్ను కాస్త మా ఇంటిదగ్గర దించండ్రా !
పాపప్రక్షాళన చేసుకోవాలి ; ... .... ...
పోనీకాస్త నాసందేశమైనా నా పిల్లలకి వినిపించండ్రా !
" బాబులు పాపలూ మన్నించండి నా పాపాన్ని .
మిమ్మల్ని కన్నన్దుకు . భయానక కాలుష్యానికి ఎరవేసినందుకు
సముద్రాలకావల మీ తలల్ని తాకట్టు పెట్టినందుకు .
బాబులూ పాపలూ మీరుమాత్రం .....................
మిరుమాత్రం ........ పిల్లల్నికని చావకండి ! "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి