30, మే 2013, గురువారం

                                            ఎగ్రిమెంట్

( బ్రతకడం చాతకాని ప్రతి వెధవా దేముడ్ని తిడతాడు . తెలివితేటలులేని ప్రతి అడ్డగాడిదా అవినీతిని తూర్పారబడతాడు . ప్రపంచం  కప్పుకొన్న గొంగట్లో ఎంట్రుకలేరుతారు మేధావులు . వాళ్ళ అతిప్రయాసకి పడిపడి నవ్వుకుంటుంది ప్రపంచం . ------ ఈ కేసులో  తీర్పిచ్చిన జడ్జిగారి అంతరంగం . )

              ఇతడు అద్దెకు తీసుకున్నాడు 50,000 లకి   నాభార్య  గర్భాశయాన్ని అని అదే కోర్టులో ఐదేళ్ళ తరువాత ,రెండవసారి , కొత్తగా బదిలీ అయివచ్చిన జడ్జిగారి ముందు ప్రారంభవాక్యంగా పలికాక జడ్జిగారి మొహంలో కదిలిన నలుపుతెలుపుల భావమిశ్రమం సందేహాత్మకంగా తోస్తున్న సమయంలో కదిలింది ప్రతివాది రామానందం కంఠం . 

             ఈ  స్టేట్ మెంట్ దారుణం , నీచం ,మనుష్యులమైన మనం ఉచ్చరించతగనిది . అతడు నా స్నేహితుడు . ఆ స్నేహంలో భాగంగానే నా భార్యకున్న లోపం కారణంగా ఆ దంపతుల్ని అర్ధించిన మాట వాస్తవం తప్ప ఇందులో ఆర్ధికపరమైన  అంశమేదీ లేదు . 

             ' అబద్ధ' మంటూ ఉధృతమైన కోపంతో అరిచి  'ఒప్పందం చేసుకున్న మాట యదార్ధం .' ఇతడ్ని సాటి ఉద్యోగిగా ఎరుగుదునేతప్ప అంత  గాఢమైన సాన్నిహిత్యమేదీలేదు మామధ్య . బిడ్డని కనిచ్చే పవిత్ర బాధ్యతలో భాగంగా పురిటిలోనే నా భార్య కౌగిలించుకున్న నరకం నిమిత్తమూ నష్టపరిహారం నేను కోరడం లేదు కానీ నా భార్య కనిచ్చిన బిడ్డకి ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సింది ఇస్తే దేముడు దయలేనివాడనే సత్యాన్ని మర్చిపోతాను శాశ్వతంగా  అన్నప్పుడు జడ్జిగారి ముసలిమీసాల్లో మెదిలిన క్లేశం నా కళ్ళ కుంకుడుగింజలు తీసిన ఛాయాచిత్రం , మెదడులో భద్రపరిచేవుంది వానపాములా మెదులుతూ అప్పుడప్పుడూ , తీర్పు వచ్చేంతవరకు . 

               అన్యాయమిది నాకు దక్కని బిడ్డకోసం నేనెందుకు ఖర్చుపెట్టాలని రామానందం అన్నదానికి                     'దక్కలేదంటే  అర్ధమేంటని '   జడ్జిగారడిగిన ప్రశ్నకు రామానందం సమాధానమిస్తూ ఇతడి భార్య కన్నఆడపిల్ల గోగుపుల్ల ,అనాకారి, కారునలుపు .పీటల్ గ్రోత్ సరిగాలేని పిల్లని అంటగట్టచూశారు. కానీ మనం దేన్నైనా ఖరీదు చేసేప్పుడు ఎంచుకుంటాం మేలిమైనవాటిని, అయినా ఆ పిల్ల పుట్టిన రెండునెలలకే పోయింది. అటువంటప్పుడు నా హస్తగతం కాని వస్తువుకోసం ధనం వెచ్చించమనడం మూర్ఖత్వమే కాదు మహాపాపం. 

                 పేగులు లుంగచుట్టుకొని గొంతుపగిలిన కన్నీటిజీరతో అన్నాను. ' నా భార్య ప్రసవించగానే ఆ పిల్ల వాళ్ళ సొంతం ,అటుపైన మా బాధ్యతేముంటుంది . పుట్టగానే తీసుకెళ్ళకపోవడం  వాళ్ళ తప్పు . మా బాధ్యతేముంటుంది. మాక్కావలసింది అనుకున్నప్రకారం ఇవ్వాల్సిన డబ్బు. అయినా రెండు నెలలు మానవతాదృక్ఫదంతో సాకాను పాపని. అందులో వుంది పెళ్లికెదిగిన నా కూతురి సహకారం. అసలు విషయం ఒప్పుకున్నదే ఆమెకోసం ఈ ప్రతిపాదన . ఆమె పెళ్లికట్నం ఇచ్చేందుకు ప్రయోజనకరమవుతుందనే మా చాలీచాలని జీవితాలని ఈ ఒప్పందం లో ఇరికించుకుంది. రెండు నెలల శిశువు చాకిరికి , వైద్యఖర్చులకి  ముట్టలేదు , అదో ఐదువేలు , వెరసి యాభైఐదు వేలు ఈ రామానందం ముట్టజెప్పాల్సిన మొత్తం .' 

                   'ది జడ్జిమెంట్ ఈజ్ రిజర్వ్ డ్ ' అని చెప్పి జడ్జిగారు ఆ జీర్ణమైన కోర్టుహాలు ధర్మాసనం దిగిపోతున్న సమయంలో వెలుపల పురాతన మర్రిమాను శాఖల్లో సృష్టికార్యంలో మునిగివున్నాయి రెండుపావురాలు. 

##___________#____________##____________#____________##_____________#____________##

 

                 

    పురాతన నాగరికతల మధ్య పరిఢవిల్లిన దేశంలో, నిత్యం పెళ్లికూతురిలా కళకళలాడే ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటన దురదృష్టకరం. ప్రజాస్వామ్యం మనకిచ్చిన గొప్పవరం ఎగ్రిమెంట్ . నమ్మకమనే ఒక పురాతన పదాన్ని మానవజాతి దాదాపుగా మర్చిపోతున్న ఈ దశలో ఇంకా పట్టుకొని వేలాడడం దురదృష్టకరం. రావణుడు విభీషనుడి చేత , జూలియస్ సీజర్ బ్రూటస్ చేత వంచించబడింది ఈ నమ్మకంతోనే.ఇంకా మనలో బుద్ధి వికసించక పోవడం శోచనీయం.   

                        ప్రతివాది రామానందం తనవాదనలో పేర్కొన్నట్లు మనం ఒక వస్తువుని ఖరీదు చేసేప్పుడు మేలిమైన దానినే ఎంచుకుంటాం . ఈ కేసులో వాది  చేసిన ప్రధమతప్పిదం ఎగ్రిమెంట్ లిఖితపూర్వకంగా లేకపోవడం. అదే జరిగుంటే ప్రతి ఘటనకీ అతనికి వెల దక్కుండేది . ఒకవేళ ప్రసవ సమయంలో అతని భార్య మరణిస్తే , లేదా శిశువు మరణిస్తే , లేదూ శిశువు అనారోగ్యంగా జన్మించిన పక్షంలో ఏం చేయాలనే విషయం ఎగ్రిమెంట్ ప్రకారం జరిగుండేది. 

                        వాది  ఐదు సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ ఈ ప్రతివాడిని తిప్పి తిప్పి తీవ్ర ఆవేదనకు గురిచేసినాడని ఈ కోర్టు నమ్ముతూ మానవతా ధర్మంతో భార్యాబిడ్డలు పోయినారనే జాలితో కేవలం ఇరవై ఐదువేల రూపాయలను సదరు ప్రతివాది ఐన రామానందంకు చెల్లించాల్సిందిగా ఆదేశించడమైనది. అలాగే ఒప్పందం చేసుకోకపోవడం ప్రజాస్వామ్యాన్నిఅపహాస్యం చేసినట్లుగా ఈ కోర్టు భావించినప్పటికీ ప్రధమ తప్పిదంగా క్షమించడమైనది. 

                          కేవలం ఏభైవేలకి మంచి భర్త దొరుకుతాడనే గ్యారంటీ లేదు . బతకడానికి సరిపడేంత సంపాదనాపరుడు భర్తగా దొరకని పక్షంలో స్త్రీలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వుందని నేననుకోను. బిడ్డలకి పెళ్లి చేయలేని వెధవలకి బిడ్డల్ని కనే అర్హత లేదు. అసలు పెఌకే అనర్హుడు .ఇతని కూతురికి నేనిచ్చే సలహా ఏమంటే నీనాగుప్తాని ఆదర్శంగా తీసుకోమని,ఏ కూలోనాలో చేసుకొంటూ సుఖంగా బ్రతకమని.

                          వారు జడ్జిమెంట్ చదివి ధర్మాసనం దిగిపోయాక ఎదురుగావున్న పురాతన మర్రిమాను తొర్రలో నల్లత్రాచొకటి పావురాయి పిల్లలమీద దాడి చేసింది. 

 

                                                                             పి . కృష్ణప్రసాద్.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి