నిర్వృతి
బాధని పిండెయ్యాలి
ఎప్పటికప్పుడు , నిమ్మకాయ
ముక్కని పిండినట్టు ,
లేదంటే మనం మిగలం .
దుఃఖ భాజనమైన ఘటనలు
మత్తెక్కిస్తాయి , ఆ తర్వాత ,
కాస్త తెరిపిన పడ్డాక .
పది పదిహేనేళ్ళ అనంతరం
గతం గుణగణాల నాణ్యతని
పరిశీలించేప్పుడు -
చీఫ్ లిక్కర్ కన్నా , నిర్వేదం
వేయింతలిస్తుంది , కిక్కు
అనుభూతమైన వాడికే , తెలుస్తుంది ,
సంతోషం మిగిల్చేది ,
చివరాఖరికి నిరాశని.
ఒద్దొద్దు ! సుఖం ,
పడదు ఈ దేహానికి
గుండెచాలా బలహీనం
ఆగిఛస్తుంది దేముడా
పట్టలేక ఆనందం .
ఏ దూరతీరాల్నుండో నన్ను
జాగృతం చేస్తావు .
చాలాదూరం నడవాలి
మరేమీ ఆశించను
కొన్ని ఓదార్పుమాటలు వినా -
ఈ సుకుమారమైన చీకటిని
మార్దవమైన దరిద్రాన్ని
మృదు పుష్పాల్ని
ఫలవృ క్షాలిచ్చినందుకు
వెన్నెల చిగురు జోడించినందుకు
స్వచ్చమైన కన్నీరు
అయాచితంగా ఒసగినందుకు
అడ్డుగోడలులేని దుఃఖావరణంలో
స్వేచ్ఛగా తిరుగాడనిచ్చినందుకు
గతజన్మల పాపఫలాల
ఆనందోత్సవంలో మైమరపించినందుకు
ప్రభూ ! జంకుతోంది హృదయం
కృతఙ్ఞతలు తెలిపేందుకు !
కమ్మనికల కరిగిపోతుందనే
భయ సంశయంతో -
సాగదీస్తుంటాయి విషువత్తులు
సమస్థాయిలో రేయింబవళ్ళని -
కన్నీటి వత్తులకి కాంతిదీపాలు
వెలిగించి ఉంచుతారు ముదుసలులు .
ఆరిపోతూ దీపం , కడసారి
వెలుతురు విరజిమ్మినట్లు ,
మృత్యువు కన్నుమలిపే ముందుక్షణం ,
ప్రాణం ఉద్దీపన చెందినట్లు
వెలిగారుతుంటాయి మతాబులు
నిప్పుల పూగుత్తిని వెదజల్లుతూ
అగ్నిబిందువుల ముత్యాలు
జలజలా రాల్చుతూ -
ఎవరివో కర్కశ పాదముద్రలు
పాత జ్ఞాపకాల గుత్తుల్లో
పక్వతచెందని ఫలాలగుర్తులు .
యవ్వనోద్రేక శిఖరాలమీదుగా
జారుతున్న ఇసుకపొరలు
పొంచిచూస్తున్న పర్వతాల
పక్కటెముకలు .
అస్థికల మంటల్లో నిరంతరం
వెలుగుతున్న భూగోళం .
అస్థికల మంటల్లో నిరంతరం
వెలుగుతున్న భూగోళం .
ఎవరిదో స్వర్గం
పిలుస్తోంది రారమ్మని
ద్వంద్వానికి సమయం నిర్ణయించి
డాలు లేదు , కవచం
లేదు శిరస్త్రాణం , పోరుఖడ్గం .
ప్రాచీన కాలమొకటి వెన్నంటి
ధైర్యవచనాలతో -
నరకమేదో పిలుస్తోంది
విలీనం చేసుకునేందుకు .
ఉన్నాయి రక్తమాంసాలూ , చీమూ ,
ముందుగా కొలుసుకున్న అడుగులు .
నన్ను నేను ఒప్పగించుకునేందుకు
వీరదాసుడినీ కాను ,
వేనుడినీ కాను , మరణించేందుకు
శాపనార్ధాల బారినపడి .
పశ్చాత్తాప పాపాలతో, తమకేం
సంబంధం లేదని , కిర్ ... కిర్
కిర్ ... కిర్రంటూ గాలికి
మూసి తెరుసుకుంటున్న
తలుపులు ఘోషిస్తుంటాయి
నరకద్వారం ముందు .
కాలం మిగిల్చిన
కాసిని కన్నీళ్ళనీ
శిరసావహించి
పాడుకుంటాను
తాదాత్మ్యంతో,
దేముడా దేముడా
నీవు తప్ప నాకు వేరు
దారిలేదయా !
కన్నీటి జడులలో తడుస్తున్న
అవధిలేని ఆనంద ప్రవాహంలో
ప్రభూ ! పునీతుడనౌతున్నాను !!!
తాదాత్మ్యంతో,
దేముడా దేముడా
నీవు తప్ప నాకు వేరు
దారిలేదయా !
కన్నీటి జడులలో తడుస్తున్న
అవధిలేని ఆనంద ప్రవాహంలో
ప్రభూ ! పునీతుడనౌతున్నాను !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి