20, జనవరి 2018, శనివారం

తెలుగు కవిత్వానికి తాజాశ్వాస "గాలి అద్దం"

తెలుగు కవిత్వానికి తాజాశ్వాస ”గాలి అద్దం”

This is the sound of poisons
The sickness no one knows
                              --- Shriek back (Faded flowers)
                             
మన మొఖం మీద  ముప్పిరిగొనే ఆశ్చర్యార్ధకాల్ని పొడుస్తూ వచ్చింది నాయుడి రెండో కవితాసంపుటి "గాలి అద్దం"
                 భాషకీ,అక్షరాలకీ,వాటిశబ్దాలకీ వుండే అల్పపరిమితిని బాగా అర్ధం చేసుకున్నాడు కనుకనే  " ఏ స్వరమూ లేని పదాలతో/అక్షరాలు శబ్దిస్తే సరిపోతుందా/ప్రతి అక్షరంలోపల శూన్యజ్వాల". అనగలిగాడు (దాటాలి)
                           అకవిత్వంకన్నా కవితాంశవున్న అస్పష్టకవిత్వం ఎప్పుడైనా మేలే.మన సంప్రదాయ అవగాహనకి అందక మనల్ని ఖిన్నుల్ని చేయడం,కవి లేదా కవిత్వం తప్పుకాదు.అది మనపరిమితిలో వుండే లోపం.వ్యక్తికి బహువచనం వ్యవస్థ.వ్యక్తిలోని సంఘర్షణ వ్యవస్థాపరమైందే తప్ప వైయక్తికం కాదు.అట్లాగని నాయుడిని జాలితో మినహాయించనవసరం లేదు మనం."జీవించే జైలులో నమ్మదగ్గ మౌనం దొరికేనా " అన్న కవిని మనం అత్యంత శ్రద్ధాసక్తులతో గమనించి వెంటనడవాలి," కీలుబొమ్మల దుఃఖాన్ని” సాదరంగా సహానుభూతితో అర్ధం చేసుకోవడానికి.          
                           నాయుడు శిల్పానికి ఇచ్చిన ప్రాధాన్యత వస్తువుకి ఇవ్వనట్లే వుంటాడు,కానీ ఓ ఉద్విగ్నభరితమైన అనుభూతినిస్తాడు. అది మనలో ఒక మానసిక పులకరింతని కలిగిస్తుంది.లేదా మనలోని అస్పృస్యవూహల్ని తట్టిలేపుతుంది.మొట్టమొదటి కవిత  "అద్దం ~ కిటికీ" తోనే మనలోని మానసిక ఉద్వేగాల మంచుపొరలమీద క్రియానిష్ఫలతని పచ్చబొట్టుగా పొడుస్తాడు.
                             కవికీ సమాజానికీ మధ్యవుండే అంతరం లేదా అంతఃసంఘర్షణే నాయుడి కవితాకర్షణ ."నహీ...నహీ" అనే కవిత అర్ధమయ్యే మంచి ఉదాహరణ.ఇతనో Rhetoric. ఇదంతా ఓ ఫిలసాఫికల్ ఎగోని.ఇది మనం నిత్యం అనుసరించే మార్గం కాదు.మన సాంప్రదాయ దుర్భిణులకు అందదు.ఏ హబుల్ దుర్భిణికీ లొంగదు.మరింత సూక్ష్మావగాహన కావాలి.వాడిపోయిన పూలపరిమళాలని అతడు దోసిలిపట్టి అందిచ్చినప్పుడు ఆఘ్రాణించి తట్టుకోగలిగే శక్తి మనలో వుండాలి.
                                  ఇంతకీ "గాలి అద్దం" దేనికి ప్రతీక ? అద్దం మన ప్రతిబింబాన్ని మనకు చూపుతుంది. అద్దంలో మనల్ని మనం చూసుకున్నంతసేపే అద్దానికి సంభంధించిన మన ఉనికి. పక్కకి వెళ్ళాక మనగురించిన జ్ఞానం అద్దానికి వుండదు. అదే అద్దం గాలిదైతే,గాలి అద్దమైతే, అది మనకి చూపించే దృశ్యం అంత విశ్వాసపాత్రమైంది కాకపోవచ్చు.అటువంటి గాలి అద్దం మనలో ఏ ప్రేమని,ఏ విశ్వాసాన్ని ప్రోదిచేస్తుంది? అసలు మన ప్రతిబింబాన్నే మనకి చూపుతోందన్న నమ్మకమేమిటి? ఐనా మన రక్తంలో జీర్ణమైన విశ్వాసాల కారణంగా మనం గాలి అద్దం తళుకుబెళుకులకు సమ్మోహితులమై కకావికలమైపోతాం."ఎవరికో చెందినవాళ్ళుగా,ఎవరికీ చెందనివాళ్ళుగా” పరాయీకరణనీ, వొంటరివైమనస్యాన్నీ పొందుతాం.                                  
                 అతనే అన్నట్లు అతని కవిత్వం "కాస్త నిరాకరించే అక్షరాలు ... ... అలవాటుకాని ఆకారాలతో పదాలు"(అలల సమాధుల్లో).అతి అరుదైన Artistic soul నాయుడి కవిత్వం.మూసిన కనురెప్పలకింద బాధాగ్నిని దాచుకున్న కవి ఇతడు,అందుకే అంటాడు "కన్నీళ్ళని ఆపిన కనురెప్పల్ని మూసినట్టు తలుపెయ్యకు"(కాలం వెలగని దీపం).
                         నాయుడి  విశిష్టతేమంటే భయకంపిత మనస్కుల్ని ఓదార్చడానికి భుజంతట్టడు.వీపుమీద అరిచేత్తో చరుస్తాడు."ఇక్కడ వోటముల్లేవ్ కన్నీళ్లేవ్ అసలిక్కడ ఎవరు బతికారు" అంటాడు.అంటే అసలు మనం బ్రతికిన,బ్రతుకుతున్న బతుకు బతుకే కాదని ఒక గొప్ప వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తూ ఆగర్భశోకితుడిలోకం కనిపిస్తోందని,చీకటి పడేలోగా చేరుకోవాలని,ఇక సర్దుకోవాల్సిన సరంజామాని వెతకాలని దైన్యంతో కాదు ధైర్యంగా తన ప్రస్థానాన్ని మొదలెడతాడు.  
                        అజ్ఞానమిచ్చే సుఖం గొప్ప ఆనందాన్నిస్తుందా,లేక జ్ఞానం ముదిరి మనిషి తనలో తాను దహించుకుపోతూ,తనతో తాను ఘర్షించుకుంటూ అశాంతితో తనను తాను ప్రశ్నించుకునే బాధాసంధర్భాలెక్కువ ఆనందాన్నిస్తాయా అంటే రెండవదేనంటాడు నాయుడు."బాధాంగాలన్నీ దొరకట్లేదు కోసితీద్దామంటే ఏది బాధించని అంగాంగమో తెలియట్లేదు "(రంగుల సాలీడు).

                 అతనే పీడకుడు,అతనే పీడితుడు.అనేకానేక మూర్తభంగిమల్లో పేర్చుకున్న మానవ శిధిలావశేషాల శయనాల మధ్య నిర్భీతిగా,ఆర్తిగా తిరుగాడే వీరబాహుడతను.వాడిపోయిన రోజుల్ని భుజానేసుకొని తిరిగే భేతాళుడు.
                 "ఇక భవిష్యత్తు అంతరించింది/నా సొంతమంటూ ఏమీలేదు/మృత్యువు తప్ప" అన్నప్పుడు అది కేవలం వైయక్తిక భయానక అనుభవం మాత్రమేకాక,నిబిడాంధకార నిశ్శబ్ధంలోకిజారి స్వప్నసమాధుల్ని ఆలింగనం చేసుకున్న అనేకానేక దగాపడ్డ మానవ సమూహాల నిశ్చేష్ట.
                  ఈ కవితా సంపుటిలోని ఒకేఒక్క Shallow Poem "మా రాక్షసుడా".దాన్ని పరిహరించివుంటే బాగుండేది.
                  మనం రాసే కవిత్వం వందేళ్ళు బతకాలి.అసలుముందు నిలబడాలి.ఇప్పటి మన కవిత్వం తర్వాతెప్పుడో సంపూర్ణంగా గ్రాహ్యమవాలి.కవిత్వం మనకి విప్పి చెప్పాల్సింది భావం కాదు,అనుభూతి మాత్రమే.విలియం కార్లోస్ విలియంస్ మాటల్లో చెప్పాలంటే "Poetry is not a matter of representation, field of action". సమాజం మిధ్య,సంఘజీవనం దుర్భరం దౌర్భాగ్యం అయిన సంధర్భంలో మనం ఆశ్రయించాల్సింది సంక్లిష్టతతో చిక్కుపడ్డ కవిత్వాన్నే.కవిత్వం ఇవ్వాల్సింది ఇంటాక్సికేషన్ కాదు Ecstasy.అది నాయుడి కవిత్వంలో పుష్కలంగా దొరుకుతుంది.
                   ఒక భాషని సజీవంగా నిలబెట్టే క్రమంలో కవిత్వం కొత్తపుంతలు తొక్కాలి.ఎప్పటికప్పుడు సరికొత్త ఉదయంలాంటి తాజాదనాన్ని అందించాలి.పట్టుమని ఓ పదిహేను స్వంతగొంతుకలైనాలేని తెలుగు కవితావరణంలో నాయుడిదో విశిష్టమైన ,విలక్షణమైన స్వరం.ఆ విధంగా సఫలుడైన శ్రేష్టమయిన కవి ఎం.ఎస్.నాయుడు.     
                                                                                                                                                                                                                                                              
                                                                                                                          -     పి.కృష్ణ ప్రసాద్.                                                                                                      
                                                                                                                                  
                                                                                
                                                                                  


10, డిసెంబర్ 2017, ఆదివారం

రసభరితం       

చాలా వుండేది ఇంతకుముందు                                                                                                           
తినడానికి తాగడానికి
చావడానికి బ్రతకడానికి
మహానందం గణాలయుద్ధం
కొత్తపరిమళాలు ఆనంద వ్యాపకాలు
కొత్తపరిచయాలు నవీనబంధాలు 
పరిమళభరితాలు సరికొత్తవ్యూహాలు

       *     *     *     *
దేముడు మరణించాడని
చెప్పిన మనిషి అర్ధం
మనిషికూడా మరణించాడని ,
అంతటివూహా తుత్తునియలైనాక
ముందెవరో ఎనకెవరో
తేలేదికాదు ఇదమిద్ధిమితంగా - 
భగవంతుడులేని మనిషి
మనిషిలేని భగవంతుడు,
వూహకి వాస్తవాన్ని జతచేసిచూడాలి       
వాస్తవానికి ఆర్ద్రతని అద్ది.
సమాధులు మిడిసిపడుతున్న
జీవన సంరంభంలొ
ఈ పాపాల చిట్టాల్ని పూడ్ఛాల్చింది
చివరికి ఎవరిగోతిలోనో
స్పష్టమయిందా ఇంతకీ !?   
                                                                   

24, డిసెంబర్ 2014, బుధవారం

పడగనీడన

ప్రతి ఆత్మహత్యా చెబుతుంది 
మనిషి సంఘజీవి కాదని 
నటించడం అతని నైజమని 
మృత్యువు మరో తల్లి నీడని.

బూజుపట్టిన ఆకాశం కింద 
బుగిలిపోయిన భూగోళం మీద 
బాగా ముసలి వాడయ్యాడు మనిషి 
చాలా కాలమైంది , కళ్ళలో కపోతాలెగిరి. 

మధ్యయుగాల మనిషి 
ఎక్కడో గాడి తప్పాడు 
తోవమరిచాడు 
జారిపోయాడు. 

ఏం చేస్తాం మనమిక్కడ ? 
డాంబికం ప్రదర్శిస్తాం. 
తింటాం లొట్టలేసుకొంటూ 
అనాధప్రేత కళేబరాల్ని. 
ఇంతజేసీ సిగ్గులేకుండా 
వగుస్తాం ప్రారబ్ధం గురించి. 
గానుగెద్దుల్లా గమిస్తుంటాం 
మలమూత్రాల రొంపిలోకి. 

ఆత్మహత్యకు అనుమతి పొందాలి 
లేదంటే మిగుల్చుకోవాలి కాసిని కన్నీళ్ళు. 

" ఇది తప్పనిసరి జాగ్రత్త ఈ రోజుల్లో " 

                                                                             07/06/2008
  

3, మార్చి 2014, సోమవారం

చీకటిపాట 


చీకటిరోజుల్లో గానాలుండవా 
ఉండకేం 
చీకటిరోజుల గురించి గానాలుంటాయి 
                            -----------     బెర్టోల్ట్ బ్రెహ్ట్

ఎంత పురోభివృద్ధి  !!
ఎప్పుడు పోయివస్తుందో తెలియని వెలుగు ,
నెలనెలా తప్పని తద్దినం .

యధాతధంగా కిరోసిన్ బుడ్డి
రెపరెపలాడుతూ కొవ్వొత్తి
లేదూ లల్లాయి బుడ్డి  .

 పునరావృతం
నా తండ్రితాతల వారసత్వం
నోట్లోముద్ద గూట్లోదీపం
ఆహా ! ఏమి నా భాగ్యం !
                                                            22-07-2005 .

(  చీకటి అన్నాక ఏదైనా కావచ్చు . ఇదో రకం చీకటి . మనం పురోగమిస్తున్నామా ? తిరోగమిస్తున్నామా ? )

           ఈ కవితని ఈ శీర్షికని ప్రారంభించిన శ్రీ కంచర్ల సుబ్బానాయుడు గారికే గౌరవంతో అంకితమిస్తున్నాను.                     


30, మే 2013, గురువారం

                                            ఎగ్రిమెంట్

( బ్రతకడం చాతకాని ప్రతి వెధవా దేముడ్ని తిడతాడు . తెలివితేటలులేని ప్రతి అడ్డగాడిదా అవినీతిని తూర్పారబడతాడు . ప్రపంచం  కప్పుకొన్న గొంగట్లో ఎంట్రుకలేరుతారు మేధావులు . వాళ్ళ అతిప్రయాసకి పడిపడి నవ్వుకుంటుంది ప్రపంచం . ------ ఈ కేసులో  తీర్పిచ్చిన జడ్జిగారి అంతరంగం . )

              ఇతడు అద్దెకు తీసుకున్నాడు 50,000 లకి   నాభార్య  గర్భాశయాన్ని అని అదే కోర్టులో ఐదేళ్ళ తరువాత ,రెండవసారి , కొత్తగా బదిలీ అయివచ్చిన జడ్జిగారి ముందు ప్రారంభవాక్యంగా పలికాక జడ్జిగారి మొహంలో కదిలిన నలుపుతెలుపుల భావమిశ్రమం సందేహాత్మకంగా తోస్తున్న సమయంలో కదిలింది ప్రతివాది రామానందం కంఠం . 

             ఈ  స్టేట్ మెంట్ దారుణం , నీచం ,మనుష్యులమైన మనం ఉచ్చరించతగనిది . అతడు నా స్నేహితుడు . ఆ స్నేహంలో భాగంగానే నా భార్యకున్న లోపం కారణంగా ఆ దంపతుల్ని అర్ధించిన మాట వాస్తవం తప్ప ఇందులో ఆర్ధికపరమైన  అంశమేదీ లేదు . 

             ' అబద్ధ' మంటూ ఉధృతమైన కోపంతో అరిచి  'ఒప్పందం చేసుకున్న మాట యదార్ధం .' ఇతడ్ని సాటి ఉద్యోగిగా ఎరుగుదునేతప్ప అంత  గాఢమైన సాన్నిహిత్యమేదీలేదు మామధ్య . బిడ్డని కనిచ్చే పవిత్ర బాధ్యతలో భాగంగా పురిటిలోనే నా భార్య కౌగిలించుకున్న నరకం నిమిత్తమూ నష్టపరిహారం నేను కోరడం లేదు కానీ నా భార్య కనిచ్చిన బిడ్డకి ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సింది ఇస్తే దేముడు దయలేనివాడనే సత్యాన్ని మర్చిపోతాను శాశ్వతంగా  అన్నప్పుడు జడ్జిగారి ముసలిమీసాల్లో మెదిలిన క్లేశం నా కళ్ళ కుంకుడుగింజలు తీసిన ఛాయాచిత్రం , మెదడులో భద్రపరిచేవుంది వానపాములా మెదులుతూ అప్పుడప్పుడూ , తీర్పు వచ్చేంతవరకు . 

               అన్యాయమిది నాకు దక్కని బిడ్డకోసం నేనెందుకు ఖర్చుపెట్టాలని రామానందం అన్నదానికి                     'దక్కలేదంటే  అర్ధమేంటని '   జడ్జిగారడిగిన ప్రశ్నకు రామానందం సమాధానమిస్తూ ఇతడి భార్య కన్నఆడపిల్ల గోగుపుల్ల ,అనాకారి, కారునలుపు .పీటల్ గ్రోత్ సరిగాలేని పిల్లని అంటగట్టచూశారు. కానీ మనం దేన్నైనా ఖరీదు చేసేప్పుడు ఎంచుకుంటాం మేలిమైనవాటిని, అయినా ఆ పిల్ల పుట్టిన రెండునెలలకే పోయింది. అటువంటప్పుడు నా హస్తగతం కాని వస్తువుకోసం ధనం వెచ్చించమనడం మూర్ఖత్వమే కాదు మహాపాపం. 

                 పేగులు లుంగచుట్టుకొని గొంతుపగిలిన కన్నీటిజీరతో అన్నాను. ' నా భార్య ప్రసవించగానే ఆ పిల్ల వాళ్ళ సొంతం ,అటుపైన మా బాధ్యతేముంటుంది . పుట్టగానే తీసుకెళ్ళకపోవడం  వాళ్ళ తప్పు . మా బాధ్యతేముంటుంది. మాక్కావలసింది అనుకున్నప్రకారం ఇవ్వాల్సిన డబ్బు. అయినా రెండు నెలలు మానవతాదృక్ఫదంతో సాకాను పాపని. అందులో వుంది పెళ్లికెదిగిన నా కూతురి సహకారం. అసలు విషయం ఒప్పుకున్నదే ఆమెకోసం ఈ ప్రతిపాదన . ఆమె పెళ్లికట్నం ఇచ్చేందుకు ప్రయోజనకరమవుతుందనే మా చాలీచాలని జీవితాలని ఈ ఒప్పందం లో ఇరికించుకుంది. రెండు నెలల శిశువు చాకిరికి , వైద్యఖర్చులకి  ముట్టలేదు , అదో ఐదువేలు , వెరసి యాభైఐదు వేలు ఈ రామానందం ముట్టజెప్పాల్సిన మొత్తం .' 

                   'ది జడ్జిమెంట్ ఈజ్ రిజర్వ్ డ్ ' అని చెప్పి జడ్జిగారు ఆ జీర్ణమైన కోర్టుహాలు ధర్మాసనం దిగిపోతున్న సమయంలో వెలుపల పురాతన మర్రిమాను శాఖల్లో సృష్టికార్యంలో మునిగివున్నాయి రెండుపావురాలు. 

##___________#____________##____________#____________##_____________#____________##

 

                 

    పురాతన నాగరికతల మధ్య పరిఢవిల్లిన దేశంలో, నిత్యం పెళ్లికూతురిలా కళకళలాడే ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటన దురదృష్టకరం. ప్రజాస్వామ్యం మనకిచ్చిన గొప్పవరం ఎగ్రిమెంట్ . నమ్మకమనే ఒక పురాతన పదాన్ని మానవజాతి దాదాపుగా మర్చిపోతున్న ఈ దశలో ఇంకా పట్టుకొని వేలాడడం దురదృష్టకరం. రావణుడు విభీషనుడి చేత , జూలియస్ సీజర్ బ్రూటస్ చేత వంచించబడింది ఈ నమ్మకంతోనే.ఇంకా మనలో బుద్ధి వికసించక పోవడం శోచనీయం.   

                        ప్రతివాది రామానందం తనవాదనలో పేర్కొన్నట్లు మనం ఒక వస్తువుని ఖరీదు చేసేప్పుడు మేలిమైన దానినే ఎంచుకుంటాం . ఈ కేసులో వాది  చేసిన ప్రధమతప్పిదం ఎగ్రిమెంట్ లిఖితపూర్వకంగా లేకపోవడం. అదే జరిగుంటే ప్రతి ఘటనకీ అతనికి వెల దక్కుండేది . ఒకవేళ ప్రసవ సమయంలో అతని భార్య మరణిస్తే , లేదా శిశువు మరణిస్తే , లేదూ శిశువు అనారోగ్యంగా జన్మించిన పక్షంలో ఏం చేయాలనే విషయం ఎగ్రిమెంట్ ప్రకారం జరిగుండేది. 

                        వాది  ఐదు సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ ఈ ప్రతివాడిని తిప్పి తిప్పి తీవ్ర ఆవేదనకు గురిచేసినాడని ఈ కోర్టు నమ్ముతూ మానవతా ధర్మంతో భార్యాబిడ్డలు పోయినారనే జాలితో కేవలం ఇరవై ఐదువేల రూపాయలను సదరు ప్రతివాది ఐన రామానందంకు చెల్లించాల్సిందిగా ఆదేశించడమైనది. అలాగే ఒప్పందం చేసుకోకపోవడం ప్రజాస్వామ్యాన్నిఅపహాస్యం చేసినట్లుగా ఈ కోర్టు భావించినప్పటికీ ప్రధమ తప్పిదంగా క్షమించడమైనది. 

                          కేవలం ఏభైవేలకి మంచి భర్త దొరుకుతాడనే గ్యారంటీ లేదు . బతకడానికి సరిపడేంత సంపాదనాపరుడు భర్తగా దొరకని పక్షంలో స్త్రీలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వుందని నేననుకోను. బిడ్డలకి పెళ్లి చేయలేని వెధవలకి బిడ్డల్ని కనే అర్హత లేదు. అసలు పెఌకే అనర్హుడు .ఇతని కూతురికి నేనిచ్చే సలహా ఏమంటే నీనాగుప్తాని ఆదర్శంగా తీసుకోమని,ఏ కూలోనాలో చేసుకొంటూ సుఖంగా బ్రతకమని.

                          వారు జడ్జిమెంట్ చదివి ధర్మాసనం దిగిపోయాక ఎదురుగావున్న పురాతన మర్రిమాను తొర్రలో నల్లత్రాచొకటి పావురాయి పిల్లలమీద దాడి చేసింది. 

 

                                                                             పి . కృష్ణప్రసాద్.    

21, మార్చి 2013, గురువారం

ఈ దారినే వెళ్ళాలి , తప్పదిక

కన్నీళ్ళన్నీ ఖర్చయాయి , 
శవంలా బిగుసుకొంది జీవితం . 
 పొడిబారిన కళ్ళతో చూడలేకున్నాను దృశ్యం . 
కొట్టుమిట్టాడుతోంది గొంతులో ఏదో రహస్యం . 
మిగిలుంటే అదే పదివేలు , కనీసం నన్ను నేను గుర్తించే జ్ఞానం :

నాయనలారా భేదాభిప్రాయాల మత్తులోపడి 
దాటివెళ్ళకండి . నన్నూ చేర్చండి ఒడ్డు , శాపనార్ధాల మధ్యైనా సరే !
 సమయానికి నిద్రమాత్రలిచ్చిందిలే మా అమ్మాయి , 
భయపడకండి , తిరగమని చెప్పండి భూమిని కాస్త నాజూకుగా , 
చస్తున్నంత పనవుతోంది కళ్ళు తిరిగి , సెకండ్ల ముల్లు మరీ పచ్చి తిరుగుబోతు .
పెద్దముల్లు ఫరవాలేదు కాసింత పడుతుంది బిడియం. చిన్నముల్లా
సరేసరి , అదో పెద్దసోమరి , ఆలోచించిమరీ వేస్తుందిఅడుగు .  

అబ్బాయిలూ ! కాలాన్ని చంపే సాధనమేదైనా వుందా?  
కనిపెట్టండి . తొందరేంలేదు . అలా కళ్ళుజాపి కూర్చుంటాను , 
బేతుపల్లి చెరువుగట్టున . గత వర్షాకాలమిదో పూర్ణగర్భిణి . 
తొణికి ఒలికి భయాన్నుసిగొల్పింది తాళ్ళమడ జనం మీదికి . 
స్త్రీలూ పిల్లలూ వృద్ధులూ బేతుపల్లి వెళ్ళారు తలదాచుకునేందుకు .
కొందరు గంగారం సాయిస్ఫూర్తి కాలేజింజనీరింగుకి , మిగిలిన జనం సత్తుపల్లి . 
నాయనలారా ఏమైంది ? నే చెప్పినపని ! 

కవిమిత్రుడు వస్తూంటాడు అప్పుడప్పుడూ , నన్ను హింసించేందుకు , 
కవిత్వం ఒండేప్పు డు కాస్తంత  ఆర్ద్రతో ఆత్మనో కలపమంటాడు 
ఈ చెరువొడ్డున కూర్చోబెట్టి . ఆ రెండూ ఎక్కడేడ్చాయిగనుక మనకి . 

" పచ్చదనం ప్రగతికి మెట్టు " 
                                    రాసిన బోర్డు దగ్గరే మొదలైంది 
                                                                                ఓపెన్ కాస్ట్ . 

సత్తుపల్లి శివార్లలో 
                        పచ్చని చిట్టడవి . 
                                              ఇప్పుడు రూపురేఖలు కోల్పోయి 
                                                                                     మిగిలిన మరుభూమి . 

అయ్యలారా ! 
                   ఈ బొగ్గెటకేగునోకదా ! ఏవో జనం భయాలు .మా నీళ్ళు కలుషితం కావుగా ? 
భూగర్భ నీటిమట్టం నిలిచేవుంటుంది గదా !
పాపం ఎవరు చెబుతారు సమాధానం ? ఎవరెవర్ని వూరడిస్తారు ! 

     ***                                ***                           ***   

అయ్యా  రాండి......................  రాండి  
ఇదిగో  ఓజోన్ పొర చింపుకొచ్చాను . 
అర్ధరూపాయికో ముక్క , కప్పుకోండి 
            తలలమీద . ఇంకేబెంగావుండదు . 
( దేముడి దయవల్ల వ్యాపారం బానేవుంది  )

  ***                                ***                           ***   

ఎందుకో భయమవుతోందిప్పుడు . అర్ధరూపాయికి కాదు , 
అయిదువేలకి అమ్మాల్సిందేమో ! కాదుకాదు ఏభైవేలకి . 
ఎంత కారుచవక్కమ్మాను  పిచ్చాడిలా ..... 
కూర్చుని ఎంచక్కా తినేవాళ్ళు 100 తరాలు నావాళ్ళు . 
ఇప్పుడు భయమవుతోందెందుకో, పిల్లల్ని కన్నందుకు . 
ఓ పక్క కొండచిలువలా ఆవులిస్తూ కాలుష్యం . 
మరోపక్క జాన్ పెర్కిన్స్  పశ్చాత్తాపం .
పాపం చుట్టూరా వీళ్ళు ; నాదేశ యువజనం , తృళ్ళుతూ ....... 
ఎంతకాలమీ చిర్నవ్వులు  ? ప్రపంచపటంలో రేపు నా దేశమెక్కడ ? 
  ***                                ***                           ***   

ఒరే బాబులూ నన్ను కాస్త మా ఇంటిదగ్గర దించండ్రా !
పాపప్రక్షాళన చేసుకోవాలి  ; ...    ....     ...   
పోనీకాస్త నాసందేశమైనా నా పిల్లలకి వినిపించండ్రా !

" బాబులు పాపలూ మన్నించండి నా పాపాన్ని . 
మిమ్మల్ని కన్నన్దుకు . భయానక కాలుష్యానికి ఎరవేసినందుకు 
సముద్రాలకావల మీ తలల్ని తాకట్టు పెట్టినందుకు . 
బాబులూ  పాపలూ మీరుమాత్రం ..................... 
మిరుమాత్రం ........  పిల్లల్నికని చావకండి ! "


    



         


11, మార్చి 2013, సోమవారం

అసలు నిజం 


మనుషులున్నాయంటావా ?
అడిగింది పిల్ల దెయ్యం తల్లిని .

"ఇంతవరకూ రాలేదు నా ఉనికిలోకి "

మరి మనాళ్ళంటారే ?

"ఔను మన పెద్దాళ్ళు అంటుంటారు
మనలో కోర్కెలు చావని వాళ్ళు
మనుషులౌతాయని "

అది నిజంకాదా మరి  ?

"ఏమో నాకు తెలియంది ఏం చెప్పను ? "

పాపం కదా మనుషులు !

తలూపింది తల్లిదెయ్యం
నిర్వికారంగా -